దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జనవరి 16వ తేదీన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 3.80 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. కాగా టీకా తీసుకున్న వారిలో 580 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని కేంద్రం వెల్లడించింది. వారిలో కేవలం 7 మందిని మాత్రమే చికిత్స నిమిత్తం హాస్పిటల్‌లో చేర్చారని తెలియజేసింది. కాగా టీకా తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు చనిపోయారని, అయితే వారి మరణానికి టీకా కారణం కాదని కేంద్రం తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో వార్డు బాయ్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిపాల్ అనే 46 ఏళ్ల వ్యక్తికి శనివారం కరోనా టీకా ఇచ్చారు. టీకా తీసుకున్న తరువాత 24 గంటలకు అతను చనిపోయాడు. కాగా అతనికి గుండె పోటు వచ్చి చనిపోయాడని, అందుకు టీకా కారణం కాదని, పోస్టు మార్టం నివేదికలో ఈ విషయం వెల్లడైందని అధికారులు తెలిపారు. కాగా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే అతను చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అలాగే కర్ణాటకలోని బళ్లారికి చెందిన నాగరాజు (43) అనే వ్యక్తి కూడా కోవిడ్ టీకా తీసుకున్న 2 రోజులకు మృతి చెందాడు. దీంతో అతనికి పోస్టుమార్టం నిర్వహించగా అతను కార్డియో పల్మనరీ వైఫల్యంతో చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది. టీకా తీసుకోవడం వల్ల నాగరాజు చనిపోలేదని, అతనికి డయాబెటిస్, ఇతర సమస్యలు ఉన్నాయని, అందువల్లే అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని వైద్యులు తెలిపారు.
కాగా కరోనా టీకా తీసుకున్న వారిలో 7 మంది దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో చేరగా, ఢిల్లీలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, ఉత్తరాఖండ్, చత్తీస్‌గడ్‌లో ఒక్కరు చొప్పున ఉన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి